గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు...
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులకు అనుమతి లభించింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుద్ధరణ, నది తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు అమలుతో మూసీ నది పరివాహక ప్రాంతం పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని సీఎం వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అందిస్తున్న సహకారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి