తెలంగాణలో జనసేన రాజకీయ ప్రస్థానం వేగవంతం...

 



హైదరాబాద్ : తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు నెరవేరేలా పనిచేస్తూ దేశ సమగ్రత, సమైక్యతకు ప్రాధాన్యం ఇస్తూ జనసేన పార్టీ తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కొత్తగా చేరిన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ పోరాట స్ఫూర్తి దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ నేల, ఇక్కడి ప్రజల త్యాగాలు తనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. ప్రజల సమస్యలను వినడం రాజకీయాల్లో అత్యంత ముఖ్యమని, అందుకోసం తెలంగాణలో కూడా ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.

ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అవసరమైతే ప్రజా ఉద్యమాల ద్వారా కూడా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ సిద్ధాంతాలను నమ్మి పనిచేస్తున్న తెలంగాణ జనసైనికులు, వీర మహిళలే పార్టీ బలం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లి “ప్రజల పార్టీ”గా నిలవాలని ఆకాంక్షించారు.

అలాగే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా జనసేన భావజాలానికి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. తెలంగాణలో ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపై బలమైన చర్చలు జరిపి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు.

సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించే సామాజిక తెలంగాణ నిర్మాణానికి జనసేన కట్టుబడి ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు.

మూలం: జనసేన పార్టీ మీడియా విభాగం

WhatsApp Share

కామెంట్‌లు