తుంగభద్ర జలాలపై కేంద్ర జోక్యం కోరిన సీఎం రేవంత్ రెడ్డి..
తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు.
తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం అయిదారు టీఎంసీలకు మించి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని పేర్కొన్నారు.
మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నీటి వినియోగ సమన్వయానికి తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు.
తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై జలసౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, ఆదిత్య నాథ్ దాస్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్డీఎస్ ఆనకట్ట భద్రతాపరంగా ప్రమాదకరంగా మారిందని, అత్యవసర పనులను గుర్తించి చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునికీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదని చర్చించారు.
ప్యాకేజీ–1, 2 పనులు ఇంకా ప్రారంభం కాలేదని, ప్యాకేజీ–3, 4 పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నిలిచిపోయిన పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
ఆర్డీఎస్ వద్ద తెలంగాణ వైపు పూడిక పేరుకుపోవడంతో నీటి మళ్లింపు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఇంజనీర్లు వివరించారు. 2004 నిపుణుల కమిటీ సూచించిన పూడికతీత చర్యలు ఇప్పటికీ అమలు కాలేదని సమావేశంలో ప్రస్తావించారు. పూడిక తొలగింపు కోసం కేంద్రంతో పాటు కర్ణాటక సహకారం కోరాలని నిర్ణయించారు.
తుంగభద్ర ఎత్తిపోతల పథకం కింద సాధ్యమైనంత నీటి వినియోగానికి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని, తుమ్మిళ్ల నుంచి నీటి వినియోగానికి కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి