ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలు తొలగాలి – ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికి ఆదర్శంగా నిలవాలి.. -- సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలంటే అనాధలు లేదా ఆర్థికంగా వెనుకబడినవారి కోసం అన్న భావనను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనే డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగగలరనే ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో పెంపొందించాలని పేర్కొన్నారు.
ఆరుట్ల పబ్లిక్ స్కూల్ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఈ పాఠశాలను తెలంగాణ విద్యా సంస్కరణలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దామని చెప్పారు.
“అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు కాదు.. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడి” అని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.26 వేల కోట్లను విద్యాశాఖ కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందిస్తున్న ఈ పాఠశాలలో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని, అడ్మిషన్లు పూర్తయ్యాయని తెలిపారు.
భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇదే తరహాలో మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ డ్రెస్సులు, షూలు, సాక్సులు, దుప్పట్లు, బ్యాగులతో కూడిన కిట్లను అందించేందుకు రూ.688 కోట్లతో టెండర్లు చేపట్టామని, జూలై చివరి నుంచి పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు.
మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడల ప్రోత్సాహం కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అంతటా ప్రభుత్వ విద్య మరింత బలోపేతం కావాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సోర్స్: సీఎంవో తెలంగాణ (ప్రెస్ రిలీజ్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి