తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది.. - - ఆరుట్లలో తొలి TPSను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
-- ఆధునిక వసతులతో ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – రాష్ట్రవ్యాప్తంగా 100 టీపీఎస్‌ల లక్ష్యం..
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను సరికొత్త దిశలో నడిపించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్నారు.
ఉదయం 9:30 గంటలకు పాఠశాల ప్రాంగణానికి చేరుకునే ముఖ్యమంత్రి, టీపీఎస్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ విద్యా కమిషన్ సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ నమూనా పాఠశాల రూపుదిద్దుకుంది.
టీపీఎస్‌లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందించనున్నారు. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ పాఠశాల రూపొందింది.
ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇప్పటికే ‘నో అడ్మిషన్’ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక కీలక అడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి