గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు
హనుమకొండ : రెండో డివిజన్ పరిధిలోని గుండ్లసింగారం శ్రీ వెంకటేశ్వర చైతన్య కాలనీలో ఎంగిలిపూల (మొదటి రోజు) బతుకమ్మ పండుగ వేడుకలను స్థానికులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి మధ్య గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి, బతుకమ్మకు నమస్కరించి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ.. కోలాటాపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను స్థానికులు కలిసికట్టుగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అందరిలో ఆనందోత్సాహాలను నింపాయి.