రంగారెడ్డిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం... విద్యార్థులకు అంకితం -- సీఎం రేవంత్ రెడ్డి..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవాన్ని అంకితం చేశారు.
పాఠశాల ప్రారంభం అనంతరం సీఎం మొత్తం ఆవరణను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
అత్యాధునిక వసతులతో రూపొందించిన తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ప్రయోగశాలలను పరిశీలించారు. సైన్స్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల రవాణా కోసం అందుబాటులో ఉంచిన బస్సులను కూడా సందర్శించారు.
నృత్యం, సంగీతం బోధన గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, వంటశాలను పరిశీలించిన సీఎం వంట సిబ్బందితో మాట్లాడి పూరీ తయారీలో కూడా భాగస్వామ్యం అయ్యారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కార్యాలయం సందర్శించి పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో చర్చించారు.
పాఠశాల ప్రాంగణంలోని వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ మైదానాలు, టెన్నిస్, క్యారమ్స్ హాళ్లు, పార్కులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు. కార్యక్రమం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా సౌకర్యాలు కల్పించగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీలు వేంనరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సలహాదారు కె. కేశవరావు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళీ తదితరులు పాల్గొన్నారు.
సోర్స్: సీఎంవో తెలంగాణ (ప్రెస్ నోట్)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి