ఆర్డీఎస్‌కు పూర్తి స్థాయిలో 15 టీఎంసీల నీరు అందేలా చర్యలు తీసుకోవాలి: కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి.

హొస్పేట్: గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాలకు చెందిన రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజోలిబండ మళ్లింపు పథకం కింద తెలంగాణకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు.

కర్ణాటకలోని హొస్పేట్ సమీపంలోని తుంగభద్ర ఆనకట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మూడు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆర్డీఎస్ కింద పాలమూరుకు కేటాయించిన 15.9 టీఎంసీలలో ప్రస్తుతం సుమారు 5 టీఎంసీల నీటినే వినియోగించగలుగుతున్నామని తెలిపారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి తరలింపులో సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన నీరు అందడం లేదని, దీని ప్రభావం గద్వాల్, అలంపూర్ ప్రాంతాల రైతులపై పడుతోందన్నారు.

మూడు రాష్ట్రాల సమన్వయంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్చలు జరుగుతున్నాయని, తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో బళ్లారి, అనంతపురం, కర్నూలు, పాలమూరు ప్రాంతాల రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.


అంతరాష్ట్ర జల వివాదాలకు సహకార దృక్పథంతో పరిష్కారం సాధించే ప్రయత్నంగా ఈ చర్చలు నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

WhatsApp Share

కామెంట్‌లు