పాలకుర్తిలో 1.8 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్ట్..


పాలకుర్తి :
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు కొనసాగిస్తున్న పాలకుర్తి పోలీసులు కీలక విజయం సాధించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన తనిఖీల్లో 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీ దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జూన్ 27న పాలకుర్తి బస్ స్టాండ్ పరిసరాల్లో వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా 1.8 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.90 వేలుగా అంచనా వేశారు. అలాగే రవాణాకు ఉపయోగించిన బ్యాగు, మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు ఒడిశాలోని బరంపూర్ ప్రాంతానికి చెందిన అమర్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఖాన్ అక్రమ్ యార్ మహమ్మద్, వాజిద్ సజ్జన్లకు సరఫరా చేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

నిందితులు ఒడిశా నుంచి రైలులో ప్రయాణిస్తూ వరంగల్ ప్రాంతంలో పోలీసు తనిఖీలు అధికంగా ఉన్నాయని గుర్తించి, పాలకుర్తి మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని, కేసులో మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం–1985లోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ దూలం పవన్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది యాకయ్య, ప్రశాంత్ రెడ్డి, సురేష్, నరేష్‌లను పాలకుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి :

గంజాయి కొనుగోలు, విక్రయం, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు శాఖ నిబంధనల మేరకు ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు.


పాలకుర్తి మండలాన్ని మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పోలీసులు పిలుపునిచ్చారు.

WhatsApp Share

కామెంట్‌లు