ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ.. ఉద్యోగుల్లో భద్రత, విశ్వాసమే లక్ష్యం: సీఎం
హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బీమా సౌకర్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం పెంచడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులతో ఉద్యోగుల బీమా రక్షణకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదనతో సింగరేణి కార్మికులకు ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.1 కోటి బీమా అమలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని, ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు.
విరమణ ప్రయోజనాల బకాయిల పరిష్కారానికి విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నామని, వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.1000 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
వేతన సవరణ కమిషన్ అంశంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొంటూ, ఉద్యోగులు రోజుకు అదనంగా ఒక గంట పనిచేసి రాష్ట్ర ఆదాయం పెంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్న సీఎం, 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి