మూసీ రివర్ ఫ్రంట్ తొలి దశ పనులపై సీఎం సమీక్ష...
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో అధికారులు తొలి దశ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ప్రాజెక్టు అమలులో అవసరమైన ప్రాంతాల్లో భూ సేకరణ చేపట్టేటప్పుడు భూ యజమానుల ఆసక్తిని బట్టి టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) ఇవ్వడం లేదా పరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని సమావేశంలో ప్రస్తావించారు. నెక్లెస్ రోడ్డులో ప్రజల కోసం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మూసీ ప్రాజెక్టు కింద చేపట్టబోయే అభివృద్ధి పనులను ఈ కేంద్రంలో ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని, అలాగే ప్రజల అభిప్రాయాలను సేకరించే విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి