మహబూబాబాద్ జిల్లాలో 128.496 కిలోల డ్రై గంజాయి దగ్ధం.
మహబూబాబాద్: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ (NDPS) చట్టానికి సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయిని మంగళవారం చట్టప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు.
'ఈగల్' (Elite Action Group for Drug Law Enforcement) మార్గదర్శకాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతితో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిబంధనల ప్రకారం నాశనం చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ప్రత్యేక యంత్రాల ద్వారా గంజాయిని దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలని సూచించారు.
జిల్లాలో గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, సమాచారదాత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు అన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి