ఏజెన్సీ ప్రాంతాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి: ముఖ్యమంత్రికి ఆదివాసీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు.


పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములకు హక్కు పట్టాలు మంజూరు చేయాలని, ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నతీకరించాలని కోరారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్) ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.
WhatsApp Share

కామెంట్‌లు