2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ వేదిక కావాలి.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం.. ఆరుగురు క్రీడాకారులకు రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలు.. 2026 ఖేలో ఇండియా సహా పలు అంతర్జాతీయ టోర్నీలకు తెలంగాణ ఆతిథ్యం


హైదరాబాద్: 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ, ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ వేదిక కావాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆ దిశగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.

గచ్చీబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 82 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి 2028 డిసెంబరులో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణలో స్పష్టమైన క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని, నిజమైన క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.

పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్సిటీ నిర్వహణలో ప్రభుత్వం జోక్యం ఉండదని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడా ప్రముఖులు భాగస్వాములవుతున్నారని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.


కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు మొత్తం రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అలాగే 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌తో పాటు హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంగా "Telangana Sports Knowledge on Wheels" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
WhatsApp Share

కామెంట్‌లు