కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. కన్నాయిగూడెంలో భారీ ర్యాలీ
ములుగు (కన్నాయిగూడెం), జూలై 24: ఢిల్లీలో యువత, విద్యార్థులపై లాఠీచార్జ్‌తో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాంబాబు, జిల్లా సీనియర్ నాయకుడు ఎండీ అప్సర్ పాషా మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత, విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువత, విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందిపోయి, అణచివేత చర్యలకు పాల్పడటం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
అలాగే, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.
(మూలం: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి