తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల.. తొలి విడతలో రూ. 2,482 కోట్ల జమ


హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయంగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం వచ్చే 9 రోజుల్లో మొత్తం రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి రూ. 2,482.02 కోట్లను విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ. 1.75 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రూ. 20,677 కోట్లు చెల్లించామని చెప్పారు.

అలాగే గత ప్రభుత్వ కాలంలో బకాయి పడిన రైతు భరోసా నిధులను చెల్లించామని, రైతు భరోసా మొత్తాన్ని రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు పెంచినట్లు వివరించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 27 వేల కోట్లకు పైగా జమ కాగా, తాజా విడుదలతో రైతు భరోసా కింద మొత్తం చెల్లింపులు రూ. 36 వేల కోట్లకు చేరనున్నట్లు పేర్కొన్నారు.

పంటలకు బోనస్, వ్యవసాయ పనిముట్లు, బీమా, ధాన్యం కొనుగోళ్ల కోసం కూడా ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులు ఆత్మగౌరవంతో జీవించేలా వ్యవసాయాన్ని పండుగగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పులు, ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణపై కూడా ముఖ్యమంత్రి వివరించారు. యువత కోసం ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున పంటల మార్పిడి వంటి చర్యలను పరిశీలించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

రైతు భరోసా నిధులు అందుకుంటున్న రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Share

కామెంట్‌లు