టీజీపీఎస్సీ నుంచి మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు.. 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం.
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరోసారి శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని రెండు కీలక ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న మొత్తం 29 పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులు, తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో 19 పోస్టులు ఉన్నాయి.
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులు
05/G/TP/2026 నోటిఫికేషన్ ప్రకారం మల్టీ జోనల్ కేడర్ పరిధిలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జూలై 10 నుంచి ఆగస్టు 17, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం అందనుంది.
ఈ పోస్టులకు B.Arch, B.E./B.Tech (సివిల్), B.Planning లేదా B.Tech (Planning)లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అదేవిధంగా M.A./M.Sc (Geography) లేదా M.Sc (Geoinformatics)తో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులకు మరో నోటిఫికేషన్
03/OG/SD/2026 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 19 ఖాళీలకు జూలై 7 నుంచి ఆగస్టు 12, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన వారికి నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు వేతన శ్రేణి వర్తిస్తుంది.
ఈ పోస్టులకు ఐసీఏఆర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీతో పాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, ఆగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీలో M.Sc (Agc.) పూర్తి చేసి ఉండాలి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వారీగా విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్, రిజర్వేషన్లు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని కమిషన్ సూచించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి