హసన్‌పర్తిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై పోలీసుల దాడి.. 7 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం స్వాధీనం
హసన్‌పర్తి, జూలై 15: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం (16 ప్లాస్టిక్ సంచులు)ను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ డి. యాదగిరి, పోలీసు సిబ్బంది పి. ధనుంజయ్య, ఎం. భరత్లతో కలిసి ఎల్లాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, దండుగుల రమేష్ ఇంటి సమీపంలోని షెడ్డులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో షెడ్డుపై దాడి చేసి తనిఖీ చేయగా, 16 ప్లాస్టిక్ సంచుల్లో 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.21 వేలగా పోలీసులు అంచనా వేశారు.
విచారణలో నిందితుడు దండుగుల రమేష్ (42), ఎల్లాపూర్ గ్రామంకు చెందినవాడని, చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కిలో రూ.30కు విక్రయించేందుకు నిల్వ ఉంచినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేదల హక్కులను దోచుకునే ఇటువంటి అక్రమ వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి