దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి


స్టేషన్ ఘనపూర్, జూలై 1:
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన 6 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.6,00,696 విలువైన చెక్కులు, అలాగే 37 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.13,62,700 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాల బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. కల్యాణ లక్ష్మి వంటి పథకాలు పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని చెప్పారు.

సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, లబ్ధిదారులు ఎలాంటి సేవల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Share

కామెంట్‌లు