ములుగు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. భార్యతో పాటు ముగ్గురు అరెస్ట్..
ములుగు జిల్లా జాకారం శివారులో ఇటీవల వెలుగులోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. హత్యకు గురైన వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన సిరిపంగ నర్సింహులు (42) గా గుర్తించారు. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 26న జాకారం గ్రామ శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వెనుక వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామ కారోబార్ ఫిర్యాదు మేరకు ములుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు ములుగు సీఐ, సీసీఎస్ సీఐ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. దర్యాప్తులో మృతుడి వివరాలను గుర్తించడంతో పాటు హత్యకు పాల్పడిన నిందితులను 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో మృతుడి భార్య సిరిపంగ శోభారాణి (A1), తాపీ మేస్త్రీ అల్లా పెద్ద వెంకటేశ్వర్లు (A2), మరో తాపీ మేస్త్రీ నీల దుర్గారెడ్డి (A3) ఉన్నారు.
పోలీసుల దర్యాప్తులో శోభారాణి, పెద్ద వెంకటేశ్వర్ల మధ్య అక్రమ సంబంధం ఉండటంతో, తమ సంబంధానికి అడ్డుగా ఉన్న నర్సింహులను హత్య చేసినట్లు వెల్లడైంది.
నిందితుల వద్ద నుంచి కారు, మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడు, బండరాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసును వేగంగా ఛేదించిన ములుగు సీఐ, సీసీఎస్ సీఐతో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా పోలీసు అధికారి అభినందించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి