డిజిటల్ గవర్నెన్స్‌తో పరిపాలనలో పారదర్శకత.. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలపై సీఎం కీలక ఆదేశాలు.


హైదరాబాద్:
రాష్ట్ర పరిపాలనలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించేందుకు వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా డిజిటల్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ నుంచే జీతాలు అందేలా ఉద్యోగులు, జీతాలు, బ్యాంకు ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షలో రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినప్పటికీ ఉద్యోగులకు సమయానికి జీతాలు అందడం లేదని వివరించారు.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోపు పారదర్శకంగా జీతాలు చెల్లించే విధంగా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనప్పటికీ జీతాలు నిలిపివేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ వ్యవస్థ అమలుపై సమగ్ర అధ్యయనం చేసి 100 రోజుల్లో నివేదిక సమర్పించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే హెల్త్ కార్డులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంఏ అండ్ యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మూలం: తెలంగాణ సీఎంఓ (అధికారిక ప్రకటన)

WhatsApp Share

కామెంట్‌లు