ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స విజయవంతం.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, ప్రస్తుతం తొలిదశలో కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు తెలిపారు.

వైద్యుల సూచన మేరకు రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయకుండా, ముందుగా కుడి భుజానికి చికిత్స అందించారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజాలకు గాయాలు కాగా, అనంతరం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ ప్రజా కార్యక్రమాలు, సమావేశాలు, పాదయాత్రలు, ఎన్నికల ప్రచారాల్లో నిరంతరం పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో తరచూ కరచాలనాలు, ఆప్యాయంగా పలకరింపులు జరగడం వల్ల గాయాలు మరింత తీవ్రతరమైనట్లు వెల్లడైంది.

ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్‌తో పాటు కండరాల చీలికలు (మసిల్ టియర్స్) కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించడంతో, ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం ముంబయిలో ఆపరేషన్ చేయించుకున్నారు.
WhatsApp Share

కామెంట్‌లు