మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునయనాలతో తుదివీడ్కోలు...అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి సీతక్క.
నల్లబెల్లి, జూలై 31: ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి శుక్రవారం స్వగ్రామం నల్లబెల్లిలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు చేపట్టిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
ఈ నెల 26న గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
అంతిమయాత్రలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన అకాల మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని నివాళులర్పించారు.
మంత్రి వెంట పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు పల్లె జైపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతనిప్పుల భిక్షపతి, ఆత్మ కమిటీ ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి