పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన హసన్‌పర్తి పోలీసులు..
హసన్‌పర్తి : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అప్పగించడంలో హసన్‌పర్తి పోలీసులు విజయవంతమయ్యారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్లను బ్లాక్ చేసి అధునాతన సాంకేతిక నిఘా పరిజ్ఞానం ద్వారా వాటి ఆచూకీ (లొకేషన్) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులకు అందజేయగా, తమ పోయిన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కాపీ ఆధారంగా సంచార్ సాథి వెబ్‌సైట్‌లోని CEIR సేవ ద్వారా మొబైల్‌ను వెంటనే బ్లాక్ చేయాలని తెలిపారు. దీంతో ఫోన్‌ను ఇతరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడంతో పాటు, పోలీసులు సులభంగా ట్రాక్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ సభ్యులు ఏ. వెంకట్, తిరుపతి, CEIR ఆపరేటర్లు పూర్ణాచారి, సోమన్న, గీత, ప్రణవి, ఇతర పోలీసు సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి