ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌ను నిర్మించాలి: సీఎం రేవంత్ రెడ్డి


వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. "పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి" అని పేర్కొన్నారు.

చదువే జీవితాన్ని మార్చే శక్తి అని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా కుటుంబాలకు ఆనందాన్ని తీసుకొస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కిట్ల నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా స్వీకరించే విధానాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, 10 ఏళ్లుగా నిలిచిపోయిన బదిలీలు పూర్తి చేశామని, 317 జీవో అమలుతో చెదిరిపోయిన కుటుంబాలను ఒకచోట చేర్చామని వివరించారు.

విద్యా రంగంలో తెలంగాణ పురోగతి సాధించిందని, పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో రాష్ట్రం 36వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. అయితే మొదటి రెండు స్థానాల్లో నిలిచే వరకు కృషి కొనసాగించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించామని, వచ్చే ఏడాది మరో 150 మందిని పంపనున్నట్లు తెలిపారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో ఉద్యోగ రంగంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుని ప్రపంచ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల నుంచే భవిష్యత్ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఎదగాలని ఆకాంక్షించిన సీఎం, చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
WhatsApp Share

కామెంట్‌లు