కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ..
నర్సంపేట : కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా నర్సంపేట డివిజన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గిరిజన గ్రామాల్లో పర్యటించి, గిరిజనులను ఏకం చేస్తూ భూ పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన నిరంతరం డిమాండ్ చేశారని తెలిపారు. కోవిడ్ కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఉద్యమానికి తన వంతు బాధ్యతగా పాల్గొన్నారని గుర్తు చేశారు.
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకుడు బానోతు జవహర్‌లాల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అలువాల నరేష్, ఎం.డి. ఖలీల్, ఎస్.కే. రంజాన్, బాలరాజు, రాజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
మూలం: సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నర్సంపేట డివిజన్ పత్రికా ప్రకటన.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి