ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
హైదరాబాద్: "జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు.
అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం తెలిపారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజానికి అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Telangana)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి