గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. చిన్నారుల భద్రతే లక్ష్యమన్న పోలీసులు
మహబూబాబాద్ : చిన్నారుల భద్రత, బాలలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు.
సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా షీ టీం హెల్ప్‌లైన్ 8712656935, అత్యవసర సేవల నంబర్లు 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళల హెల్ప్‌లైన్ 181, 1091 సేవల గురించి వివరించారు.
ప్రధానోపాధ్యాయులు రాంజీ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ పోలీసు శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంజీ నాయక్, ఉపాధ్యాయులు, షీ టీం, ఏహెచ్‌టీయూ, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 150 మంది విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి