మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: అధికారులకు సీఎం ఆదేశాలు..
హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు.
అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ పూర్తికాకముందే టెండర్లు పిలవకూడదని సీఎం స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే మూడు మున్సిపల్ కమిషనరేట్ల పరిధిలో చేపట్టే పనులకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు.
సమావేశంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) భవనం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, వాటి నిర్మాణం మరియు సౌకర్యాలపై పలు సూచనలు చేశారు.
సమీక్ష సమావేశానికి మున్సిపల్ పరిపాలనా శాఖ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు, హైడ్రా, హెచ్‌ఎండీఏ, జలమండలి తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO).

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి