ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం: నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది – సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కాలానుగుణంగా ఎదగాలని సూచించారు. నైపుణ్యాలు వ్యక్తిగత విజయానికే కాకుండా సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు.

యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోందని, ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

"నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు... నైపుణ్యాలను పెంపొందించుకోండి. మీ వ్యక్తిగత విజయంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ మీ వంతు పాత్ర పోషించండి. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

WhatsApp Share

కామెంట్‌లు