విద్యార్థుల యూనిఫాంలపై వాట్సాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. నాణ్యత ఆధారంగా వచ్చే ఏడాది మార్పులు: సీఎం


హైదరాబాద్
: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాంల నాణ్యత, సైజు, రంగు తదితర అంశాలపై విద్యార్థుల నుంచి నేరుగా వాట్సాప్ ద్వారా అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్) సేకరిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాంల పంపిణీ విధానం, రంగులు, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం యూనిఫాంల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు అందించే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు వేగవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో యూనిఫాంల పంపిణీలో లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్న సీఎం, ప్రస్తుతం మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అలాగే, వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2 నాటికే విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)
WhatsApp Share

కామెంట్‌లు