బ్యాటరీల చోరీ కేసును ఛేదించిన నర్సంపేట పోలీసులు.. ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ...
నర్సంపేట : ఇటీవల పాకాల రోడ్డులోని ఓ బండల షాపులో ఉన్న రెండు గూడ్స్ ట్రాలీల బ్యాటరీలు చోరీకి గురైన ఘటనను నర్సంపేట స్టేషన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన బ్యాటరీలతో పాటు ఘటనలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులు వస్తుండగా, పోలీసులను గమనించిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా, ఆటోలో ఉన్న రెండు బ్యాటరీలను ఇటీవల పాకాల రోడ్డులోని బండల షాపు నుంచి దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఎస్‌కే నాయాబ్ రసూల్ (ఎన్‌జీవోస్ కాలనీ), ముద్ధంగుల మహేష్ (వడ్డెర కాలనీ)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిందితుల నుంచి చోరీకి గురైన రెండు గూడ్స్ ట్రాలీ బ్యాటరీలతో పాటు ఘటనలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి