ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం ఏ. రేవంత్ రెడ్డి


న్యూఢిల్లీ, జూలై 28: ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో పెద్దగా సమస్యలు తలెత్తలేదని, ఆఫ్‌లైన్ పరీక్షల సమయంలోనే లీకేజీలు వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీలో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, దేశవ్యాప్తంగా అనుమతి లేకుండా కోచింగ్ కేంద్రాలు విస్తరిస్తున్నాయని, వాటిలో కొన్ని ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని విమర్శించారు. ఈ సమస్యను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో సమగ్ర విధానం రూపొందించాలని సూచించారు.

యూనివర్సిటీలపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, విద్యను వీలైనంత వరకు రాష్ట్రాల పరిధిలో ఉంచితే పారదర్శకత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేసి పారదర్శకంగా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో గ్లోబరీనా వంటి సంస్థలపై చర్యలు తీసుకోకపోవడంతో అవి సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించి గందరగోళానికి కారణమయ్యాయని ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతోందని, గత ప్రభుత్వ బకాయిల భారం ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇకపై ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను అదే ఏడాదిలో పూర్తిగా చెల్లించి, ముందస్తుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల వరకు ఈ పథకానికి అవసరమవుతుందని తెలిపారు.

హైడ్రా వ్యవహారంపై స్పందిస్తూ, హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. న్యాయస్థాన ఆదేశాలను గౌరవిస్తూనే, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
WhatsApp Share

కామెంట్‌లు