ఉద్యమ నాయకుడికి అశ్రునయనాలతో తుదివీడ్కోలు..


నర్సంపేట: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి శుక్రవారం ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.

గుండెపోటుకు గురై పలురోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడవడంతో ఆయన మృతిపై రాజకీయ, సామాజిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను ఈ సందర్భంగా పలువురు నాయకులు స్మరించుకున్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల మధ్య పనిచేసిన నాయకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసిన ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను కొనియాడారు.

అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణం నర్సంపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.

ఉద్యమ బాటలో మొదలైన ప్రస్థానం.. ప్రజానాయకుడిగా నిలిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి..అన్నా అంటే నేనున్నా అనే నైజం...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టుకున్న నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ప్రజా సమస్యలపై పోరాటం, ఉద్యమ రాజకీయాల పట్ల అంకితభావం, కార్యకర్తలతో మమేకమయ్యే స్వభావం ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి.

వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాల్లో ముందుండి ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతానికి నర్సంపేట ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో విశేష కృషి చేశారు.

ఉద్యమ కాలంలో ప్రజలతో నేరుగా మమేకమవుతూ, తెలంగాణ ఆకాంక్షను ప్రతి ఇంటికి చేరవేయడానికి ఆయన నిరంతరం శ్రమించారు. ఉద్యమం పట్ల ఆయన చూపిన నిబద్ధత, పార్టీ పట్ల విధేయతతో కార్యకర్తలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నర్సంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతాంగం, సాగునీటి సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు.

గుండెపోటుతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ ఆయన మరణించడం రాజకీయ వర్గాలు, కార్యకర్తలు, అభిమానులను విషాదంలో ముంచింది. ఆయన మరణంతో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఒక సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా దూరమైనా, ఉద్యమకారుడిగా, ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని సన్నిహితులు, అభిమానులు పేర్కొంటున్నారు.
WhatsApp Share

కామెంట్‌లు