సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సందేశం.. అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడి
- భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తి గౌరవం.. కానీ దూషణలు, బెదిరింపులు, తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం.
అమరావతి, జూలై 1 : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక సందేశాన్ని విడుదల చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, అది అపరిమిత హక్కు కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు, నిర్ణయాలతో విభేదించే హక్కును తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. అయితే వ్యక్తిగత దూషణలు, ప్రాణహానితో బెదిరింపులు, ఆధారాలు లేని ఆరోపణలు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, మత విశ్వాసాలను అవమానించడం, ద్వేషపూరిత ప్రసంగాలు, సైబర్ వేధింపులు వంటి చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రావని పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్య పదజాలం, పరువు నష్టం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరిగాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక అవమానకర వ్యాఖ్యలు చేయడం కూడా చట్టపరంగా సమర్థనీయం కాదని అన్నారు.
సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆయన, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్క్రీన్‌షాట్‌లు, లింకులు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు స్వీకరించి, ప్రతి నిజమైన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు.
ఫేక్ అకౌంట్ల ద్వారా పదేపదే దుర్వినియోగానికి పాల్పడుతున్న వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని బాధ్యతగల పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నేరానికి కులం, మతం, రాజకీయ పార్టీ అనే భేదం లేదని, తప్పు చేసిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), సమాచార సాంకేతిక చట్టం–2000తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా పరిరక్షిస్తామని తెలిపారు.
చివరగా, "మన మాటల్లో బాధ్యత, మన భాషలో గౌరవం, మన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషులను కలిపే వేదిక కావాలి.. విడదీసే వేదిక కాకూడదు" అని పిలుపునిచ్చారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి