ట్రాఫిక్, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు


హైదరాబాద్, జూలై 24: రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు రోడ్డు భద్రత పర్యవేక్షణను బలోపేతం చేయడానికి ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై సమగ్ర అధ్యయనం చేసి ఏర్పాటు చేసే బ్యూరోకు స్పష్టమైన సంస్థాగత నిర్మాణం ఉండాలని సీఎం పేర్కొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ట్రాఫిక్ వ్యవస్థలో కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని సీఎం అన్నారు. వాతావరణ పరిస్థితులు, కార్యాలయాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణానికి ముందే ట్రాఫిక్ అధ్యయనం తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్న సీఎం, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓఆర్ఆర్‌పై ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్‌లో స్మార్ట్ సిగ్నలింగ్ విధానంపై సమగ్ర అధ్యయనం చేయాలని, సాధ్యమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మించి సిగ్నల్‌ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. వాహనాలు సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోకుండా నిరంతరాయంగా రాకపోకలు సాగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
WhatsApp Share

కామెంట్‌లు