లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచంలో విషాదం..
ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
1938 ఏప్రిల్ 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి, తన మధుర గానంతో భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి కోట్లాది సంగీతాభిమానుల అభిమానాన్ని సంపాదించారు.
ఆమె గాన ప్రతిభకు గుర్తింపుగా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సినీ సంగీతానికి చిరస్మరణీయమైన సేవలను అందించింది.
ఎస్. జానకి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఆమె తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నవరసాలను ఆవిష్కరిస్తూ ఆమె ఆలపించిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయని తెలిపారు. తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు.
భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి