ఆసియా U23 అథ్లెటిక్స్‌లో తెలంగాణ కీర్తి పతాకం.. ప్రవల్లిక నరిమళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ బిడ్డ అయిన ప్రవల్లిక నరిమళ్ల ఆసియా U23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి మహిళల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టుకు స్వర్ణ పతకాన్ని అందించడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ప్రవల్లిక అంతర్జాతీయ వేదికపై రాణించడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారని ప్రశంసించారు.
మహిళల 4×400 మీటర్ల రిలేలో ప్రవల్లిక నరిమళ్లతో పాటు శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్ సభ్యులుగా ఉన్న భారత జట్టు 3 నిమిషాల 33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆతిథ్య దేశం చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.
అంతర్జాతీయ స్థాయికి చేరుకునే ముందు ప్రవల్లిక రాష్ట్రస్థాయిలోనే 23 స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 35 పతకాలు సాధించి విశేష ప్రతిభ చాటారు. ఆమెను తీర్చిదిద్దిన కోచ్‌లను కూడా ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు మొత్తం 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో కలిపి 16 పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, విజేతలందరికీ అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి