22-ఏ భూములపై సీఎం కీలక నిర్ణయం.. ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం...
హైదరాబాద్: 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆస్తి హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వ్యక్తి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లు తేలితే.. రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. అది ప్రైవేట్ భూమిగా నిర్ధారణ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు.
22-ఏ జాబితాలోని భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
22-ఏ భూముల వ్యవహారంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు. పుకార్లు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి