కాజీపేటలో వరుస బైక్ చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్.. నాలుగు ద్విచక్ర వాహనాల స్వాధీనం...
హనుమకొండ : కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ధ నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన తోటపల్లి రాజు (40) ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడికి గతంలో కూడా కాజీపేట, మట్వాడ, కేయూసీ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత అవసరాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్‌సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
ఇటీవల పెరుగుతున్న బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన కాజీపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. కాజీపేట సీఐ శ్యామ్‌సుందర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు బి. శివ, మౌనికా రెడ్డి, యాదగిరి, క్రైమ్ టీమ్ సభ్యులు వీ. క్రాంతికుమార్, జీ. కుమారస్వామి ప్రత్యేక బృందంగా గాలింపు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కేసును త్వరితగతిన ఛేదించి చోరీకి గురైన నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ప్రజల భద్రత కోసం నేరాల నియంత్రణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాలను భద్రత కలిగిన ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని, తప్పనిసరిగా తాళాలు వేయాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనధికారిక పార్కింగ్ చేయరాదని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్థానిక ప్రజలు కేసును త్వరగా ఛేదించి వాహనాలను స్వాధీనం చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి