పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణ : పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నియామక ప్రక్రియకు భంగం కలిగించేలా కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో, డీజీపీ సీవీ ఆనంద్తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
నియామక ప్రక్రియలో నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, ఎలాంటి లోపాలు లేదా అవకతవకలకు తావులేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, పరీక్షల నిర్వహణ తదితర ప్రతి దశలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలపై సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, సీవీ ఆనంద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి