హైదరాబాద్ రహదారి అభివృద్ధిపై సీఎం సమీక్ష.. రోడ్ నెట్‌వర్క్‌ను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ఆదేశం...
హైదరాబాద్: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రహదారి నిర్మాణం, విస్తరణ, నిర్వహణకు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న రోడ్ నెట్‌వర్క్ విస్తరణ పనులపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. భూసేకరణ, రుణాల సమీకరణ, నిర్వహణతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్‌ఆర్), ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర రహదారి ప్రాజెక్టులన్నింటినీ సమన్వయంతో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఓఆర్ఆర్ నిర్వహణలో లోపాలు, రహదారిపై వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ముఖ్యంగా కొంగరకలాన్–ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్డు-1 పనులను డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను వెంటనే తొలగించి, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్, బంజారాహిల్స్–శిల్పా లేఅవుట్ ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి రహదారి మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉందని పేర్కొన్న సీఎం, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యానికి అవకాశం ఇవ్వొద్దని, టీడీఆర్‌ల జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి