ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం: పాయం చిన్న చంద్రన్న


నర్సంపేట
: అస్తిత్వం, హక్కులు, మనుగడ కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచి పోరాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాయం చిన్న చంద్రన్న పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ నాయకుడు దార లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాయం చిన్న చంద్రన్న మాట్లాడారు.

తరతరాలుగా ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవిస్తున్నారని, వారిని అభివృద్ధి చేయాల్సిన పాలకులు హామీలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల పూర్వీకుల నుంచి రక్షించుకుంటూ వస్తున్న ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను అమలు చేయడంతో పాటు పీసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్లు, పంటలకు గిట్టుబాటు ధర, విద్య, ఉపాధి, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.

ఏజెన్సీ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను నిర్మించాలని, ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకుడు కోడి సోమయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు, కోడం సారయ్య, పొన్నం కుమారస్వామి, రాములు, సుధాకర్, పాషా, సారక్క చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Share

కామెంట్‌లు