కీర్తినగర్‌లో మహిళ మృతదేహం.. ఆధార్‌తో వెలుగులోకి వచ్చిన వివరాలు

వరంగల్: కీర్తినగర్‌లో మహిళ మృతదేహం వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది. కట్టమల్లన్న దేవాలయం సమీపంలోని ఓపెన్ ప్లాట్‌లో ఉన్న చిన్న గదిలో మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కొన్నిరోజుల క్రితం ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న గీసుగొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అక్కడ లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని నర్సంపేటకు చెందిన బూర రామగా గుర్తించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కొంతకాలంగా ఇంటికి దూరంగా..

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నర్సంపేట, చెన్నారావుపేటతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేదని తెలిపారు.

ఆమెను గతంలో కుటుంబ సభ్యులు నాలుగైదు సార్లు ఇంటికి తీసుకువచ్చినప్పటికీ.. కొంతకాలానికి మళ్లీ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేదని పేర్కొన్నారు.

అనుమానం లేదన్న కుమారుడు..

తల్లి మృతిపై తనకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి కుమారుడు సతీష్ పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపాడు. దీంతో అతని దరఖాస్తు ఆధారంగా గీసుగొండ పోలీసులు BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు.

మృతదేహానికి సంబంధించిన వైద్య, చట్టపరమైన ప్రక్రియలను పోలీసులు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Share

కామెంట్‌లు