వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ కూలీ మృతి...


వర్ధన్నపేట: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వర్ధన్నపేటలోని ఇల్లంద గ్రామానికి చెందిన మహమ్మద్ యాకుబ్ (52) రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు, ప్రతిరోజూ లాగే కూలి నిమిత్తం వరంగల్‌కు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో 12వ తేదీన మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు గ్రామంలోని ప్రధాన రహదారిపై బేతి సాంబయ్య ఇంటి సమీపంలో ఆటో నుంచి దిగాడు.

అనంతరం రహదారి దాటుతుండగా వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న క్విడ్ కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకుబ్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే యాకుబ్‌ను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆగస్టు 13న తెల్లవారుజామున సుమారు 4 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడి కుమారుడు మహమ్మద్ జామల్ (26) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట ఎస్సై ఎన్. సాయి బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
WhatsApp Share

కామెంట్‌లు