ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు.. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.. సిఎం రేవంత్ రెడ్డి...


సంగారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇకపై ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ఏ ఒక్క ఉద్యోగ ఖాళీని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

3.42 కోట్ల మందికి సన్నబియ్యం...

పేదలు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో రేషన్ షాపుల వ్యవస్థను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్కెట్‌లో వాటి ధరలు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గాయని అన్నారు.

రైతులకు రూ.1.70 లక్షల కోట్ల వ్యయం...

వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంపై రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత 32 నెలల్లో రైతులు పండించిన పంటల కొనుగోళ్లకు రూ.90 వేల కోట్లు చెల్లించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు.

రైతు రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి 25 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున పెంచి మొత్తం రూ.36 వేల కోట్లు అందించామని తెలిపారు.

మహిళలకు ప్రాధాన్యం...

ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళా ప్రభుత్వమని సీఎం పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ అందించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని, తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళలకు కేటాయించామని తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.

అర్హులందరికీ పెన్షన్లు...

వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి అన్నారు. చేనేత, గీత కార్మికులతో పాటు సికిల్ సెల్ అనీమియా బాధితులకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఏడాదిలో 70 వేల ఉద్యోగాల భర్తీ...

నిరుద్యోగ యువతను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు.

“ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది. ఏ ఖాళీలను గాలికి వదిలేయం. పోటీ పరీక్షలకు సిద్ధం కండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అప్పుల భారం ఉన్నా అభివృద్ధి వైపు...

గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులకు వడ్డీలు చెల్లిస్తూ సంక్షోభంలో ఉన్న తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది రూ.75 వేల కోట్లు అప్పుల చెల్లింపులకు వెచ్చిస్తున్నామని తెలిపారు. సంక్షోభంలో ఉన్న సంక్షేమ పథకాలను గాడిలో పెట్టి అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
WhatsApp Share

కామెంట్‌లు