మేడారంలో వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ములుగు: వనదేవతలు సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొక్కులో భాగంగా సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన ముఖ్యమంత్రి అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం..
మేడారంలో స్థానికంగా అర్హులైన వితంతు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
భక్తుల కోసం తాగునీటి ప్లాంట్ ప్రారంభం..
మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళా సంఘాల సభ్యులతో సీఎం భేటీ..
ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వారి ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ రామచంద్ర నాయక్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి