సనత్‌నగర్‌లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి...


హైదరాబాద్: సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి **డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)**ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను మంత్రులతో కలిసి పరిశీలించారు.

కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ తదితర విభాగాలను సీఎం పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.

చికిత్స కోసం వచ్చే రోగుల నమోదు ప్రక్రియ, రిసెప్షన్‌లో ఏర్పాటు చేసిన టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పనితీరు, ఓపీ కౌంటర్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించిన సీఎం వాటి వినియోగం, పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
WhatsApp Share

కామెంట్‌లు