గీత, చేనేత కార్మికులకు సంతృప్త స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.



ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు.

గీత కార్మికుల వృత్తిని పరిరక్షించేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లను నాటాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదని, బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడని సీఎం పేర్కొన్నారు.

పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, కులవృత్తులను గౌరవిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అవసరమైనన్ని నిధులు కేటాయిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలిపారు.

సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Share

కామెంట్‌లు