ప్రపంచ తల్లి పాల వారోత్సవాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: మంత్రి సీతక్క


హైదరాబాద్, ఆగస్టు 1: ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు (ఆగస్టు 1–7) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు.

తల్లి పాలు ప్రతి శిశువుకు సహజసిద్ధమైన సంపూర్ణ పోషకాహారమని మంత్రి తెలిపారు. శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు తొలి రోగనిరోధక టీకాలా పనిచేస్తాయని పేర్కొన్నారు. జన్మించిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించి, తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. అనంతరం వయస్సుకు తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగిస్తే పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు.

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు, పట్టణ వార్డుల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి ప్రచారం, కమ్యూనిటీ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అంగన్వాడీ సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో గర్భిణీలు, బాలింతలు, రెండేళ్లలోపు పిల్లల తల్లులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ శాస్త్రీయ అవగాహన కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కోరారు.

ప్రసూతి జరిగిన ప్రతి ఆసుపత్రిలో శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు అందేలా చర్యలు తీసుకోవాలని, తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు. పోషకాహార లోపం లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన జీవితానికి తల్లిపాలే బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు.

ప్రపంచ తల్లి పాల వారోత్సవాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, వైద్యులు, మహిళా సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
WhatsApp Share

కామెంట్‌లు